Central Vista: అతి త్వరలోనే కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టాకు పర్యావరణ అనుమతులు
- ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా సీపీడబ్ల్యూడీకి పర్యావరణ శాఖ ఆదేశాలు
- వాయు కాలుష్యం నిరోధించేలా కూల్చివేతలకు సాంకేతికతను వాడాలని సూచన
- నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అతి త్వరలోనే రాబోతున్నాయి. అనుమతులకు సంబంధించిన ప్రణాళికలను వీలైనంత త్వరగా తయారు చేయాల్సిందిగా కేంద్ర ప్రజా పనుల విభాగాన్ని (సీపీడబ్ల్యూడీ) కేంద్ర పర్యావరణ శాఖ నియమించిన నిపుణల కమిటీ ఆదేశించింది.
ప్రాజెక్టుకు సంబంధించి పాత భవనాల కూల్చివేతల సమగ్ర ప్రణాళికలు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ వంటి వాటిపై సమగ్ర నివేదికలు ఇవ్వాల్సిందిగా ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ ఆన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సూచనలు చేసింది. వాయుకాలుష్యాన్ని నిరోధించేందుకు భవనాలను ఒకేసారి కూల్చేయాలని, అందుకు అత్యాధునిక సాంకేతికతను వాడుకోవాలని సూచించింది.
మరోవైపు కేంద్ర సచివాలయ భవనాలు, కాన్ఫరెన్స్ కేంద్రం, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్ క్లేవ్ ల నిర్మాణంపై ఇప్పటికే కదమ్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్స్ అనే కంపెనీతో కలిసి సీపీడబ్ల్యూడీ నివేదిక ఇచ్చింది. ముందుగా అనుకున్న వ్యయం రూ.11,794 కోట్లను సవరించింది. మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.13,450 కోట్లకు పెంచింది. కాగా, మొత్తంగా 17 లక్షల 21 వేల 500 చదరపు మీటర్ల మేర కొత్త ప్రాజెక్టును కట్టనున్నారు. దాని కోసం 4 లక్షల 58 వేల 820 చదరపు మీటర్ల మేర ఉన్న కట్టడాలను కూల్చివేయనున్నారు.