Adimulapu Suresh: గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయారు: పవన్ ను ఎద్దేవా చేసిన మంత్రి ఆదిమూలపు
- ఏపీలో పవన్ వర్సెస్ వైసీపీ మంత్రులు
- గుడివాడలో నిప్పులు చెరిగిన పవన్
- ఘాటుగా స్పందించిన మంత్రులు
- సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయన్న ఆదిమూలపు
- ఎప్పుడెవరికి మద్దతిస్తారో ఆయనకే తెలియదని వ్యంగ్యం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, వైసీపీ మంత్రుల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. పవన్ గుడివాడలో చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రులు భగ్గుమంటున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ జనసేనానిపై ధ్వజమెత్తారు. రాజకీయం అంటే సినిమా సెట్టింగులు, షూటింగులు కాదని అన్నారు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయని వ్యాఖ్యానించారు.
సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి... ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటే మా నాయకుడిలా పాదయాత్ర చేయండి అంటూ పవన్ కల్యాణ్ కు సూచించారు. అయినా, 14 నెలల పాటు పాదయాత్ర చేయడం అంటే సినిమా చేసినట్టు కాదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఏ పార్టీకి మద్దతిస్తారో పవన్ కల్యాణ్ కే తెలియదని, గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయారని దెప్పిపొడిచారు.
జనసేన తరఫున రాజోలు నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పుడా పార్టీకి చాలా దూరమయ్యారు. ఆయన కొంతకాలంగా వైసీపీకి సన్నిహితంగా మసలుకుంటున్నారు. సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యే అని చెప్పడం తప్ప ఆయనకు, పార్టీకి మధ్య సంబంధాలు దాదాపు లేవనే భావించాలి.