Girls: పాకిస్థాన్ లో మైనారిటీ అమ్మాయిల వెతలు... పెళ్లి కోసం అమ్మాయిలను బలవంతంగా మాతమార్పిడి చేస్తున్న వైనం!
- పాక్ లో మంటగలుస్తున్న మైనారిటీ హక్కులు
- బాలికలను మతమార్పిడి చేసి పెళ్లిళ్లు జరిపిస్తున్న వైనం
- హిందూ, సిక్కు, క్రైస్తవ బాలికలే టార్గెట్
- ఏటా 1000 మంది అమ్మాయిల మతమార్పిడి
పాకిస్థాన్ లో మైనారిటీ వర్గాల హక్కులు ఏ విధంగా కాలరాస్తున్నారో చెప్పాలంటే నేహా అనే అమ్మాయి గురించి వివరిస్తే సరిపోతుంది! నేహా ఓ క్రైస్తవురాలు. ఏసును కీర్తిస్తూ చర్చిల్లో వినిపించే సంగీతానికి ఆమె పరవశించిపోతుంది. కానీ ఇప్పుడామెకు ఆ భాగ్యంలేదు. గతేడాది ఆమెను బలవంతంగా క్రైస్తవం నుంచి ఇస్లాంలోకి మతమార్పిడి చేశారు. అప్పటికి ఆమెకు 14 ఏళ్లు. తనకంటే మూడు రెట్లు అధిక వయసున్న వ్యక్తి (45)తో ఆమెకు పెళ్లి చేశారు. అతడికి అప్పటికే ఇద్దరు పెద్ద పిల్లలున్నారు.
ఇప్పుడు నేహా భర్త జైల్లో ఉన్నాడు. పెళ్లీడుకు రాని అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడన్న ఆరోపణపై అతడిపై అభియోగాలు మోపారు. తన సోదరుడు జైలు పాలవడానికి నేహానే కారణమని అతడి మరిది నేహాను కాల్చేందుకు కోర్టులోనే తుపాకీ తీశాడు. దాంతో నేహా అజ్ఞాతంలో గడపాల్సి వస్తోంది. ఇతర అమ్మాయిల్లా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పెళ్లి, కాపురం అంటూ ఆమె జీవితం అంధకారంలో మగ్గిపోయింది.
ఇది నేహా ఒక్కరి సమస్య మాత్రమే కాదు, పాకిస్థాన్ లో ఏటా 1000 మంది అమ్మాయిల వరకు మతమార్పిడికి గురవుతున్నారు. మైనారిటీ వర్గాల నుంచి వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారు. కేవలం పెళ్లిళ్ల కోసమే ఇలా చేస్తున్నారని పాక్ లోని మానవ హక్కుల సంఘాలు ఎలుగెత్తుతున్నాయి. ఇటీవల లాక్ డౌన్ సందర్భంగా స్కూళ్లు మూతపడడంతో అమ్మాయిలపై ఈ అక్రమార్కుల కన్ను పడిందని హక్కుల కార్యకర్తలు తెలిపారు. మామూలు రోజుల కంటే లాక్ డౌన్ సమయంలోనే ఈ తరహా మతమార్పిళ్లు అధికంగా జరిగాయని వెల్లడించారు.
పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించడం, వారింట్లో ఉన్న అమ్మాయిలను మతమార్పిడి చేసి పెళ్లిళ్లు జరిపించడం నిత్యకృత్యంగా మారిందని వివరించారు. హిందూ, సిక్కు, క్రైస్తవ వర్గాల్లోని బాలికలు ఈ తరహా అపహరణలకు గురవుతున్నారని అమెరికా ప్రభుత్వ అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ వెల్లడించింది. ఇప్పటివరకు హిందూ అమ్మాయిలనే ఇలా మతమార్పిడి చేస్తుండగా, ఇటీవల కాలంలో క్రైస్తవ కుటుంబాల నుంచి కూడా అమ్మాయిలు ఈ తరహా దారుణాలకు బలైపోతున్నారు.