Siddaramaiah: గొడ్డుమాంసం తింటానని ధైర్యంగా చెప్పుకోగలను... మీకా దమ్ముందా?: సహచర కాంగ్రెస్ నేతలపై సిద్ధరామయ్య విసుర్లు

Siddaramaiah questions his Congress party men for lacking courage

  • సమస్యలపై నేతలు స్పందించడంలేదన్న మాజీ సీఎం
  • కాంగ్రెస్ నేతలు గందరగోళంలో ఉన్నారని వెల్లడి
  • ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని స్పష్టీకరణ
  • గోవధ వ్యతిరేక బిల్లును దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు

కర్ణాటకలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై స్పందించడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమవుతున్నారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని అంశాలపై మాట్లాడడంలో కాంగ్రెస్ నాయకులు ధైర్యం చూపించలేకపోతున్నారని అసహనం ప్రదర్శించారు. తాను గొడ్డుమాంసం తింటానని గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాట ధైర్యంగా చెప్పగలనని, నా అంత ధైర్యంగా మీరు చెప్పగలరా? అంటూ సహచర కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

"గతంలో నేను ఇదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పాను. బీఫ్ తింటాను, అడగడానికి మీరెవరని గద్దించాను. ఏం తినాలనేది నా హక్కు, ప్రశ్నించే అధికారం మీకెక్కడిదని నిలదీశాను. మీకిష్టం లేదా, అయితే తినొద్దు, నాకు ఇష్టం కాబట్టే తింటున్నాను... ఈ విధంగా మీరు చెప్పగలరా?" అని సిద్ధరామయ్య కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు పర్యవసానాలకు భయపడి పలు అంశాలపై మాట్లాడడంలేదని, కనీసం తమ వైఖరి కూడా చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. తమ మౌనం ద్వారా ఇతరులు మాట్లాడుతున్నదే సరైనది అనే భావన కలుగజేస్తున్నారని విమర్శించారు. 'దయచేసి మీరు ఇలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రండి' అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గోవధ వ్యతిరేక బిల్లును దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News