Politics: దేవుడు హెచ్చరించినందునే...: రజనీకాంత్ కీలక కామెంట్
- రాజకీయాల్లోకి రానని నిన్న సంచలన ప్రకటన
- ఆసుపత్రిలో చేరడం దేవుడి హెచ్చరికే
- తమిళ రాజకీయాల్లో కొనసాగనున్న రాజకీయ శూన్యత
తన అభిమానులను తీవ్ర నిరాశపరుస్తూ, రాజకీయాల్లోకి రావడంలేదని నిన్న సంచలన ప్రకటన చేసిన రజనీకాంత్, ఇందుకు తన ఆరోగ్య పరిస్థితే కారణమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తానెంతో బాధతో తీసుకున్నానని, తానిక రాజకీయాల్లోకి రాబోనని చెబుతూ మూడు పేజీల లేఖను విడుదల చేశారు.
"నేను ఆసుపత్రిలో చేరడాన్ని దేవుడు ఇచ్చిన హెచ్చరికగా భావిస్తున్నాను. కరోనా మహమ్మారి సమయంలో నేను బయట తిరిగితే ఆరోగ్యం చెడిపోతుందని అనిపించింది. నేను తీసుకున్న నిర్ణయం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించవచ్చు. కానీ ప్రజలు, ఫ్యాన్స్ నన్ను క్షమిస్తారనే భావిస్తున్నాను" అని అన్నారు.
ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో ఉన్న రజనీకాంత్ పై, దాదాపు 25 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే ఎప్పటికప్పుడు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చిన ఆయన, రెండేళ్ల క్రితం రజనీ మక్కల్ మండ్రం పేరిట పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ఆపై ఎన్నికలకు సమయమున్న కారణంగా రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.
తమిళనాడు రాజకీయాల్లో దిగ్గజ నేతలైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే చీఫ్ ఎం కరుణానిధిలు ఏడాది వ్యవధిలో కన్నుమూయడంతో, ఏర్పడిన రాజకీయ శూన్యతను రజనీకాంత్, కమల్ హాసన్ పూర్తి చేస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో, రజనీ వెనకడుగు వేయడం గమనార్హం.