COVID19: కొవిడ్ మృతుల్లో 70 శాతం మంది పురుషులే!
- కేసుల్లోనూ వాళ్లే ఎక్కువ
- 63% మందికి సోకిన వైరస్
- బాధిత మహిళలు 37%
- మహమ్మారి సోకిన యువత 39%
ప్రపంచాన్ని కరోనా గడగడలాడించడం మొదలెట్టి దాదాపు ఏడాదైపోతోంది. ఇంకో నెలైతే మన దేశంలోకి మహమ్మారి ప్రవేశించి ఏడాదవుతుంది. ఈ ఒక్క ఏడాదిలో అది ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. మరెన్నో జీవితాలను నాశనం చేసింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా మనదేశంలో కోటీ 2 లక్షల 44 వేల 853 మందికి వైరస్ సోకింది. లక్షా 48 వేల 439 మందిని చంపేసింది.
అయితే, మహమ్మారి బారిన పడింది ఎక్కువగా పురుషులేనని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దానికి బలైపోయింది కూడా పురుషులే. కరోనా కేసుల్లో 63 శాతం మంది పురుషులైతే, మిగతా 37 శాతం మహిళలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
వయసు వారీగా 17 ఏళ్ల లోపు 8 శాతం మంది, 18–25 ఏళ్ల మధ్య 13 శాతం, 26–44 ఏళ్ల మధ్య 39%, 45–60 ఏళ్ల మధ్య 26 శాతం, 60 ఏళ్లకు పైబడిన వారు 14 శాతం దాకా ఉన్నారని ఆయన చెప్పారు. చనిపోయిన వాళ్లలో 70 శాతం మంది పురుషులేనని చెప్పారు. మొత్తం మరణాల్లో 45 శాతం మంది 60 ఏళ్లలోపు వారేనని తెలిపారు.
కాగా, ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 60 శాతం యాక్టివ్ కేసులున్నట్టు చెప్పారు. కొత్త రకం కరోనాపైనా ప్రస్తుత వ్యాక్సిన్లు పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పనిచేయవని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని, దాని గురించి లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని సూచించింది.