exams: పదో తరగతి పరీక్షల విషయంలో మీడియాలో వస్తోన్న వార్తలు నిజం కాదు: ఏపీ విద్యా పరిశోధన, శిక్షణ మండలి
- ఎన్ని పేపర్లు ఉంటాయన్న విషయంపై నిర్ణయం తీసుకోలేదు
- ఉన్నతాధికారులు నిర్ణయాన్ని తీసుకుంటారు
- మే నెలలో పదో తరగతి పరీక్షలు
- ఏప్రిల్ 30 వరకు తరగతులు
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది మే నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని విద్యా పరిశోధన, శిక్షణ మండలి సంచాలకుడు బి. ప్రతాప్‌రెడ్డి చెప్పారు. పాఠశాలల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయన్న విషయంపై మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు.
దీనిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. తాజాగా టీచర్లతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాగా, ఏపీలోని 9, 10 తరగతుల విద్యార్థులకు వచ్చే ఏడాది జనవరి 6, 7, 8 తేదీల్లోనూ.. అలాగే, 7, 8వ తరగతుల విద్యార్థులకు 21, 22, 23 తేదీల్లోనూ ఫార్మేటివ్-1 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఏప్రిల్ 30 వరకు తరగతులు నిర్వహించే వెసులుబాటు ఉందని, సిలబస్ త్వరగా పూర్తి చేయాలన్న ఆందోళన టీచర్లకు అవసరం లేదని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో ఆప్షనల్ అంశాలు ఏమీ ఉండవని ఆయన చెప్పారు. ఇప్పటికే సిలబస్ తగ్గించామని, దీంతో సిలబస్‌లోని అన్ని అంశాలనూ పూర్తిగా బోధించాలని చెప్పారు. తరగతుల్లో గైడ్లను అనుసరిస్తూ పాఠాలు చెప్పొద్దని ఆయన అన్నారు. నేషనల్ టాయ్ ఫెస్టివల్‌ను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు.