COVID19: తప్పుడు వైద్యంతోనే కరోనాలో మార్పులు: ఐసీఎంఆర్​

Careless use of therapies may lead to mutations says ICMR

  • అలాంటి చికిత్సల వల్లే వైరస్ పై రోగనిరోధక ఒత్తిడి
  • బ్రిటన్ స్ట్రెయిన్ అలా ఏర్పడిందే
  • వ్యాపించే వేగం కలవరపెడుతోంది

చాలా దేశాలకు ‘బ్రిటన్ కరోనా’ పాకేసింది. మన దేశానికీ అది వచ్చేసింది. దానితో ఎక్కువ ప్రమాదం లేదని ప్రభుత్వం, నిపుణులు చెబుతున్నా.. అది సోకే వేగమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. అయితే, వైరస్ లో ఇలాంటి జన్యుమార్పులకు కారణం తప్పుడు, నిర్లక్ష్య ధోరణి వైద్యమేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం కొవిడ్ కు సంబంధించినంత వరకు తప్పుడు వైద్యం వల్లే వైరస్ జన్యు పరంగా ఉత్పరివర్తనం చెందుతోందని, లేని చికిత్సలు చేయడం వల్లే మార్పులు జరుగుతున్నాయని, బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా అలా వచ్చిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. మామూలుగా వైరస్ లో మార్పులు జరుగుతూనే ఉంటాయని, కానీ, బ్రిటన్ వైరస్ విషయంలో మాత్రం వేగంగా వ్యాపించడమే కలవరపెడుతోందని అన్నారు. తప్పుడు చికిత్సలతో వైరస్ మీద రోగనిరోధక ఒత్తిడి పెరగడం వల్లే మార్పులు జరుగుతున్నాయన్నారు.

వాతావరణ పరిస్థితులే మహమ్మారిలో ఉత్పరివర్తనాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నా.. శాస్త్రీయత లేని వైద్యం చేసి వైరస్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా మార్పులు జరుగుతాయన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

టీకాతో కరోనా రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. కరోనాకు ప్రస్తుతం తయారు చేస్తున్న వ్యాక్సిన్లన్నీ వైరస్ లోని ఎస్ ప్రొటీన్ లక్ష్యంగా పనిచేసేవేనని, కొన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లూ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ప్రస్తుతానికి వైరస్ మీద బాగానే పనిచేస్తున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News