Jagan: గుంకలాంలో 'వైయస్సార్ జగనన్న కాలనీ' పైలాన్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
- విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న జగన్
- గుంకలాంలో 397.36 ఎకరాల్లో అతి పెద్ద లేఔట్ ను సిద్ధం చేసిన అధికారులు
- 12,301 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా గుంకలాంలోని 'వైయస్సార్ జగనన్న కాలనీ' పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలించారు. కాసేపట్లో లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. గుంకలాంలో 397.36 ఎకరాల్లో అతి పెద్ద లేఔట్ ను అధికారులు సిద్ధం చేశారు. ఇక్కడ మొత్తం 12,301 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద లేఔట్ ఇదే కావడం గమనార్హం.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను జగన్ నిజం చేస్తున్నారని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా, ఇళ్లను కూడా కట్టిస్తామని అన్నారు. ప్రజల అవసరాలన్నింటినీ తీర్చడమే లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని తెలిపారు.
మరో మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చిన ఘనత కేవలం జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ అండగా నిలిచారని కితాబునిచ్చారు. మహిళా సాధికారిత ఛాంపియన్ జగన్ అని... మహిళా సాధికారతలో దేశానికే ఆయన ఆదర్శంగా నిలిచారని అన్నారు.