Vishnu Vardhan Reddy: జగన్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నట్టయితే.. ఈ పని చేయాలి: విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్
- ఇళ్ల పట్టాల పంపిణీలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది
- జనవరి 5న ఆధారాలతో నిరూపిస్తాం
- ఈ కుంభకోణంపై జగన్ సీబీఐ విచారణను కోరాలి
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇళ్ల పట్టాల పంపిణీలో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెడతామని... శ్రీకాళహస్తి బస్టాండ్ వద్ద జనవరి 5న ఆధారాలతో సహా అవినీతిని నిరూపిస్తామని అన్నారు. ఒకవేళ అవినీతి జరగకపోతే... వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడకు వచ్చి అవినీతి జరగలేదని నిరూపించాలని సవాల్ విసిరారు.
ఫోక్స్ వ్యాగన్ కుంభకోణంలో బొత్స సత్యనారాయణపై ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణను కోరారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. సీబీఐ విచారణ తర్వాత కడిగిన ముత్యంలా బొత్స బయటకు వచ్చారని అన్నారు. నిజంగా సీఎం జగన్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నట్టయితే భూముల కుంభకోణంపై సీబీఐ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని బీజేపీ ఖండిస్తోందని.. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. బాధ్యులైన నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని అన్నారు.