Haryana: హర్యానా, రాజస్థాన్ లలో సున్నా డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న చలి గాలులు
- ఢిల్లీలో 3.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- గుల్మార్గ్ లో ఏడు ఇంచుల మేర హిమపాతం
చలిగాలుల తీవ్రతతో ఉత్తర భారతం వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. హర్యానా, రాజస్థాన్ లలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయి. జమ్మూ కశ్మీర్, లఢఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పలు ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి.
పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న శీతల గాలులు ఎముకలు కొరికేంత చలి పుట్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలకు పడిపోయాయి. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఉదయం 7 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో మంచు కురవడం ప్రారంభమైంది. అనంతరం అది పుల్వామా, బుద్గాం జిల్లాలకు కూడా పాకింది. స్కీరిసార్ట్ అయిన గుర్మార్గ్ లో ఏడు ఇంచుల మేర మంచు కురిసింది. సోమవారం రాత్రి గుల్మార్గ్ లో మైనస్ 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఉత్తరాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.