Chiranjeevi: హీరోలు తయారవుతారనే విషయాన్ని నీవు మరోసారి నిరూపించావు: సోనూసూద్ పై చిరంజీవి ప్రశంసలు
- సోనూసూద్ ఆత్మకథతో 'ఐయాం నో మెస్సయ్య' పుస్తకం
- చిరంజీవికి పుస్తకాన్ని అందించిన సోనూసూద్
- నీ జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకం అన్న చిరంజీవి
లాక్ డౌన్ సమయంలో వేలాది మందికి సాయం చేసిన సినీ నటుడు సోనుసూద్ రియల్ హీరోగా నిలిచాడు. ఎంతో మంది పేదలకు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా మారాడు. ఈ నేపథ్యంలో సోనూసూద్ ఆత్మకథతో 'అయాం నో మెసయ్య' అనే పేరు మీద పుస్తకం వచ్చింది. సోనూసూద్ సేవలను చూసి ప్రజలు 'వలసదారుల మెసయ్య' అని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో సోనుసూద్ కూడా అంతే వినమ్రంగా స్పందించారు. తాను మెసయ్య (మహాపురుషుడు)ను కాదని చెప్పాడు. ఒక మనిషిగా తోటి మనిషికి సాయం చేశానంతేనని అన్నాడు.
తన ఆత్మకథ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవికి సోనూసూద్ అందించారు. ఈ సందర్భంగా సోనుపై తనకున్న అభిమానాన్ని చిరు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'నీ పుస్తకం విడుదల సందర్భంగా కంగ్రాట్స్ సోను. హీరోలు జన్మించరు, వారు తయారవుతారనే విషయాన్ని నీవు మరొకసారి నిరూపించావు. ఎన్నో వేల మందిని ఆదుకుని, ఎంతో ఎత్తుకు ఎదిగావు. నీ జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం' అని ట్వీట్ చేశారు. సోను తనకు పుస్తకాన్ని అందిస్తున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
మరోవైపు, ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సంస్థ ప్రచురించింది. మీనా అయ్యర్ ఈ పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించారు. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేయవచ్చు.