International Flights: జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం
- ప్రత్యేక విమానాలు, కార్గో సేవలకు మాత్రం అనుమతి
- ఎంపిక చేసిన మార్గాలలో ఇంటర్నేషనల్ షెడ్యూల్డ్ విమానాలకు అనుమతి
- కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో కీలక నిర్ణయం
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 31 వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
అయితే ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గో సేవలకు మాత్రం ఈ నిషేధం వర్తించదని తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ ప్రకటనను వెలువరించింది. కేస్ టు కేస్ ప్రాతిపాదికన ఎంపిక చేసిన మార్గాలలో ఇంటర్నేషనల్ షెడ్యూల్డ్ విమానాలను అనుమతించే అవకాశం ఉందని డీజీసీఏ తెలిపింది.
మార్చి చివరి వారంలో విమాన కార్యకలాపాలను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ విధించి, కఠిన నిబంధనలను అమలు చేసింది. అనంతరం మే నెలలో మళ్లీ విమాన కార్యకలాపాలను ప్రారంభించింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు మిషన్ వందే భారత్ ను ప్రారంభించింది. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో, మళ్లీ విమాన సర్వీసులను నిషేధించింది.