IT Returns: ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం
- వ్యక్తిగత రిటర్నులకు జనవరి 10 వరకు గడువు పొడిగింపు
- కంపెనీల రిటర్నులకు ఫిబ్రవరి 15 వరకు గడువు
- డిసెంబర్ 28 వరకు దాఖలైన 4.54 కోట్ల రిటర్నులు
కరోనా వైరస్ నేపథ్యంలో ఆదాయపు పన్ను రిటర్నుల గడువును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది. జనవరి 10 వరకు గడువును పొడిగించింది. ఇదే సమయంలో కంపెనీల రిటర్నుల దాఖలుకు 15 రోజుల వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 15లోగా రిటర్నులు దాఖలు చేసే అవకాశాన్ని కల్పించింది.
వాస్తవానికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల రిటర్నులకు డిసెంబర్ 31, కంపెనీల రిటర్నులకు జనవరి 31 వరకు ఇంతకు ముందు గడువు విధించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగిస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 28 వరకు 4.54 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.