Kurnool District: కర్నూలు జిల్లాలో తెరపైకి ఫ్యాక్షన్.. హత్యను అడ్డుకున్న స్థానికులు!
- తుగ్గలి మండలంలో భగ్గుమన్న పాత కక్షలు
- తండ్రుల హయాం నుంచి ఉన్న కక్షలు
- ఊరికి వచ్చిన వ్యక్తిని హతమార్చేందుకు యత్నించిన ప్రత్యర్థులు
రాయలసీమలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ పడగలు విప్పుతోంది. కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలు... ఇప్పుడు మళ్లీ పాత కక్షలతో భగ్గుమంటున్నాయి. కడప జిల్లాలో నిన్న సుబ్బయ్య అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈరోజు కర్నూలు జిల్లాలో త్రుటిలో ఒక వ్యక్తి చావు నుంచి తప్పించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే, తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామానికి చెందిన రాంభూపాల్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డిల మధ్య పాత గొడవలు ఉన్నాయి. వారి తండ్రుల హయాం నుంచే కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాంభూపాల్ రెడ్డి సొంత ఊరును వదిలి హైదరాబాదుకు వచ్చాడు. హైదరాబాదులో పని చేసుకుంటున్నాడు. ఇటీవలే ఆయన కడమకుంట్లకు వెళ్లాడు.
ఈరోజు ఓ ఆలయానికి వెళ్లి, అక్కడే ఉన్న షాపులో టీ తాగుతుండగా అమర్ నాథ్ రెడ్డి వర్గం దాడి చేసింది. ఇనుపరాడ్ తో దాడి చేసి, గన్ తో ఫైర్ చేయబోయే తరుణంలో అక్కడే ఉన్న ప్రజలు గుమికూడారు. దీంతో, ప్రత్యర్థి వర్గీయులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు రాకపోయి ఉంటే ఓ హత్య జరిగి ఉండేది. మరోవైపు ప్రత్యర్థుల దాడిలో రాంభూపాల్ రెడ్డి కాలికి గాయం అయింది. గాయంతోనే పత్తికొండకు వెళ్లిన ఆయన.. అక్కడి ఆసుపత్రిలో చేరాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను హత్య చేసేందుకు అమర్ నాథ్ రెడ్డి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.