Kapil Gujjar: బీజేపీలో చేరిన షహీన్‌బాగ్ షూటర్.. కాసేపటికే పార్టీ నుంచి తొలగింపు
- సీఏఏకి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో ఆందోళనలు
- తుపాకితో రెండు రౌండ్ల కాల్పులు
- పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలో తుపాకితో హల్‌చల్ చేసి, గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన కపిల్ గుజ్జర్ నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పార్టీ నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకున్నాడు.
బీజేపీలో చేరిన అనంతరం గుజ్జర్ మాట్లాడుతూ.. బీజేపీ హిందూత్వం కోసం పనిచేస్తుండడంతోనే ఆ పార్టీలో చేరినట్టు తెలిపాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే బీజేపీ అతడిని పార్టీ నుంచి తొలగించడం గమనార్హం.
ఇదిలావుంచితే, అప్పట్లో కాల్పుల అనంతరం గుజ్జర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరి వివాహ వేడుకల సమయంలో ఢిల్లీ వీధుల్లో రాకపోకలకు అంతరాయం కల్పిస్తున్నారన్న కారణంతోనే కాల్పులు జరిపినట్టు అప్పట్లో విచారణ సందర్భంగా పోలీసులకు చెప్పాడు. 2019 నుంచి తన తండ్రి ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చాడు.