Andhra Pradesh: జగన్ లేఖతో అధికారులకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాకేశ్ కుమార్

AP High Court justice Rakesh Kumar makes sensational comments on YS Jagan
  • ప్రభుత్వ ఆస్తుల విక్రయం కేసులో తుది విచారణ పూర్తికాకుండానే పిటిషనా?
  • న్యాయమూర్తిపై స్వయంగా ఐఏఎస్ అధికారే క్రూరమైన ఆరోపణలా?
  • న్యాయమూర్తులపై పోస్టులు పెడితే చర్యలు తీసుకోరా?
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వెంటనే చర్యలు తీసుకుంటారా?
  • విస్మయం వ్యక్తం చేసిన జస్టిస్ రాకేశ్ కుమార్
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరికొందరిపైనా తీవ్ర విమర్శలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులకు ఎక్కడలేని ధైర్యం వచ్చిందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసులో తుది విచారణ మొదలు కాకమునుపే అవాంఛనీయ రీతిలో ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలైందని విస్మయం వ్యక్తం చేశారు. డివిజన్ బెంచ్ సభ్యుడిగా ఉన్న న్యాయమూర్తిపై ఐఏఎస్ అధికారి చాలా క్రూరమైన ఆరోపణలు చేశారన్నారు. జగన్ లేఖ తర్వాత ప్రభుత్వ అధికారుల్లో ఎక్కడలేని ధైర్యం వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి నిర్బంధ బోధనా మాధ్యమంగా ఇంగ్లిష్‌ను ప్రవేశపెట్టే ఉత్తర్వును కోర్టు కొట్టివేసిన మరుక్షణం నుంచి హైకోర్టు పైన, ఒక న్యాయమూర్తిపైనా అశ్లీల, అభ్యంతరకర, అగౌరవమైన భాషలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయని జస్టిస్ రాకేశ్ కుమార్ గుర్తు చేశారు. వాటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీ ఎస్పీ సారథ్యంలోని సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే మాత్రం వెంటనే కేసులు పెడుతున్నారని, అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. కానీ, న్యాయమూర్తులపై పోస్టులు పెడితే మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్వయంగా అధికార పార్టీ ఎంపీ నందిగం సురేశ్ హైకోర్టుపైనా, జడ్జిలపైనా విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని జస్టిస్ రాకేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh
AP High Court
Justice Rakesh Kumar
YS Jagan

More Telugu News