Jammu And Kashmir: ముగ్గురు టెర్రరిస్టులను కాల్చి చంపిన బలగాలు.. అమాయకులను చంపేశారన్న బంధువులు!
- శ్రీనగర్ శివార్లలో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన బలగాలు
- వీరు ముగ్గురూ ఓవర్ గ్రౌండ్ వర్కర్లు అని ప్రకటించిన పోలీసులు
- టెర్రరిస్టు ముద్ర వేసి చంపేశారంటున్న బంధువులు
దేశమంతా కరోనా కారణంగా ఇబ్బంది పడుతుంటే... పాక్ సైన్యం, టెర్రరిస్టులు మాత్రం వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. టెర్రరిస్టులను సరిహద్దులు దాటించి పాక్ సైన్యం పంపుతుంటే... మన గడ్డపైకి అడుగుపెట్టిన ముష్కరులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు.
ఇదే సమయంలో, మన సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ, ముష్కరులను మట్టుబెడుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ శివార్లలో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్ కౌంటర్ ను సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టారు.
ఎన్ కౌంటర్ తర్వాత ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ హతమైన ముగ్గురూ టెర్రరిస్టులేనని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అయితే వీరి పేర్లు పోలీసు రికార్డుల్లో మాత్రం లేవని చెప్పారు. వీరిలో ఇద్దరికి టెర్రరిస్టులతో బలమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. టెర్రరిస్టులతో సంబంధాలు కలిగిన వారిని OGW అని పిలుస్తారు. అంటే 'ఓవర్ గ్రౌండ్ వర్కర్' అని అర్థం. చనిపోయిన వారిలో ఒకరు 2017లో ఎన్ కౌంటర్ అయిన హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు రయీస్ ఖచ్రూకి బంధువు అని పోలీసు అధికారి చెప్పారు.
మరోవైపు, ఈ ఎన్ కౌంటర్ జరిగిన గంటల వ్యవధిలోనే, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ మృతుల బంధువులు ఆరోపించారు. అమాయకులను టెర్రరిస్టులంటూ చంపేశారని మండిపడ్డారు. హతులలో ఒకరు ఒక పోలీస్ అధికారి కుమారుడని, మరొకరు 11వ తరగతి చదువుతున్న విద్యార్థి అని అన్నారు. అయితే వీరు ముగ్గురూ OGWలు అని పోలీసులు పేర్కొన్నారు.