ICC: కోహ్లీ ర్యాంకు మారలేదు.. రహానె మళ్లీ దూసుకొచ్చాడు!
- టెస్ట్ ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ
- రెండో స్థానంలోనే విరాట్ కోహ్లీ
- ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి రహానె
- బౌలింగ్ లో అశ్విన్ 7, బుమ్రాకు 9వ స్థానం
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకు మారలేదు. బ్యాటింగ్ విభాగంలో యథావిధిగా 879 పాయింట్లతో తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే, కోహ్లీ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రహానె టాప్ టెన్ లోకి దూసుకొచ్చాడు. ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని 784 పాయింట్లతో ఆరో ర్యాంకును దక్కించుకున్నాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 112, రెండో ఇన్నింగ్స్ లో 27 నాటౌట్ స్కోర్లతో జట్టు విజయంలో అతడు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ లో ఐదో ర్యాంకు సాధించిన రహానె.. దానిని కోల్పోయాడు. మళ్లీ ఇప్పుడు ఆరో స్థానానికి వచ్చాడు.
కాగా, బౌలింగ్ విభాగంలో 793 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ ఏడో స్థానానికి వచ్చాడు. రెండు స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. 783 పాయింట్లు సాధించిన జస్ ప్రీత్ బుమ్రా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా తన మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భాగంగా మూడు వికెట్లు తీసి 57 పరుగులు చేసిన జడేజా.. జాసన్ హోల్డర్ తో ఉన్న అంతరాన్ని ఏడు పాయింట్లకు తగ్గించుకోగలిగాడు.
మొత్తంగా బ్యాటింగ్ లో 890 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, బౌలింగ్ లో 909 పాయింట్లతో ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. బ్యాటింగ్ లో చతేశ్వర్ పుజారా 728 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు.