Komatireddy Venkat Reddy: మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నా: కోమటిరెడ్డి

From March Iam taking up Padayatra says Komatireddy

  • పాదయాత్రలో టీఆర్ఎస్ పాలనను ఎండగడతా
  • నా మీద కోపంతో ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారు
  • బీజేపీవాళ్లు జైలుకు పంపుతారనే భయం కేసీఆర్ లో వచ్చింది

టీఆర్ఎస్ పాలనను ఎండగట్టేందుకు మార్చి నెల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. నల్గొండ జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

ఉదయసముద్రం ప్రాజెక్టుకు రూ. 150 కోట్లు, శ్రీశైలం సొరంగ మార్గం పనుల పూర్తికోసం రూ. 1000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని... లేకపోతే జనవరి 7న నేషనల్ హైవే 65ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వచ్చేంత వరకు తన ధర్నా కొనసాగుతుందని అన్నారు. ధర్నా సమయంలో గొడవలు జరిగినా, అరెస్టులు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

కేవలం తన మీద కోపంతోనే ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారని కోమటిరెడ్డి మండిపడ్డారు. తాము కడుతున్న పన్నులతో సిద్ధిపేటను కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మొత్తం తెలంగాణ కు ముఖ్యమంత్రా? లేక సిద్ధిపేటకు మాత్రమే ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు.

 నిధులు ఇవ్వకుండా సర్పంచ్ లను కేసీఆర్ అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీవాళ్లు జైలుకు పంపుతారనే భయం కేసీఆర్ లో వచ్చిందని... అందుకే ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత కొత్త వ్యవసాయ చట్టాలకు జై కొట్టారని ఎద్దేవా చేశారు. ఐకేపీ కొనుగోళ్లను రద్దు చేస్తే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలలో తిరగలేరని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News