Pawan Kalyan: 'ఎక్కడ వీరత్వం ఉండదో అక్కడ స్వార్థం జయిస్తుంది..' అంటూ పవన్ కల్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
- 2021కి స్వాగతం పలుకుతూ పవన్ ప్రత్యేక సందేశం
- వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ శుభాకాంక్షలు తెలిపిన పవన్
- పరశురాం కీ ప్రతీక్షలోని పంక్తుల ఉదహరింపు
- ఒక సందేశం యుద్ధం చెయ్యాలని వ్యాఖ్యలు
- అన్ని వర్గాలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్ష
నూతన సంవత్సరం 2021 ఘడియలకు స్వాగతం పలుకుతూ టాలీవుడ్ అగ్రహీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ వీరత్వం ఉండదో అక్కడ పుణ్యం క్షీణిస్తుంది... ఎక్కడ వీరత్వం ఉండదో అక్కడ స్వార్థం జయిస్తుంది అంటూ శ్రీ రామ్ ధారి సింగ్ దినకర్ రచించిన పరశురామ్ కీ ప్రతీక్షలోని పంక్తులను ఉదహరించారు. ఈ కొత్త సంవత్సరం మన జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒక దేశం ఉద్ధరింపబడాలంటే ఒక సందేశం యుద్ధం చెయ్యాలి.. రాజ్యాన్ని సేవించినవాడు రాముడైతే, ఆ రాజ్యాన్ని సాధించినవాడే పరశురాముడు అని పవన్ కల్యాణ్ కీర్తించారు.
అటు, జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కల్యాణ్ కొత్త సంవత్సర సందేశం అందించారు. ఆశావహ దృక్పథంతో ప్రవేశిస్తున్న 2021 నూతన వసంతంలో దేశ ప్రజలు, తెలుగు వారందరికీ తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నూతన సంవత్సర శుభకాంక్షలు అంటూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
2020లో మానవాళిని భయకంపితులను చేసిన కరోనా మహమ్మారి ప్రపంచ ప్రగతి రథ చక్రాన్ని కొన్ని నెలల పాటు నిలువరించిందని తెలిపారు. కోట్లాది మందిని ఆసుపత్రి పాల్జేసిందని, లక్షలాది ప్రాణాలు చిదిమేసిందని పవన్ కల్యాణ్ వివరించారు. దీనికి తోడు ప్రకృతి బీభత్సాలు కూడా వెంటాడాయని, 2020 చివరి రోజుల్లో తెలంగాణ, హైదరాబాదుకు భారీ వర్షాలు, ఏపీ రైతులకు నివర్ తుపాను కన్నీరు మిగిల్చినట్టు తెలిపారు.
అయితే కరోనా మహమ్మారిపై శాస్త్ర విజ్ఞానం పైచేయిగా నిలిచిందని, వ్యాక్సిన్ రూపంలో కొవిడ్ అంతుచూసే వ్యాక్సిన్ మన శాస్త్రవేత్తల కృషి ద్వారా ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఈ కొత్త సంవత్సరంలో దేశంలోని అందరికీ వ్యాక్సిన్ ద్వారా కరోనా నుంచి రక్షణ కలగాలని కోరుకుంటున్నానని, రైతులు, కౌలు రైతులు, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, కళాకారులు, కార్మికులు అన్ని వర్గాల వారు తమ కుటుంబాలతో సుఖశాంతులతో విలసిల్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పవన్ వివరించారు.