Narsing Yadav: ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
- కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నర్సింగ్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- నర్సింగ్ మృతితో టాలీవుడ్ లో విషాదం
- దిగ్భ్రాంతికి గురైన సినీ ప్రముఖులు
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సింగ్ యాదవ్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళ భాషల్లోనూ నర్సింగ్ అనేక చిత్రాల్లో నటించారు. ఆయన తన కెరీర్ లో 300కి పైగా సినిమాల్లో పలు పాత్రలు పోషించారు. పక్కా హైదరాబాద్ యాసలో డైలాగులు చెప్పే నర్సింగ్ విలన్ గానూ, కమెడియన్ గానూ తనదైన ముద్ర వేశారు.
కాగా, నర్సింగ్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు విషాదానికి లోనయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలినాళ్లలోనే ఆయన ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడందరినీ విషాదంలో ముంచెత్తుతూ ఆయన ఈ లోకాన్ని వీడారు.
నర్సింగ్ స్వస్థలం హైదరాబాద్. 1968 జనవరి 26న జన్మించాడు. తొలి చిత్రం హేమాహేమీలు. అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ కు ఎంతో గుర్తింపు వచ్చింది. మాయలోడు, క్షణక్షణం, వర్షం, సైనికుడు, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్టర్, ఇడియట్, పోకిరి, యమదొంగ, సై, అన్నవరం వంటి చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు.