China: చైనాలో అడుగుపెట్టిన బ్రిటన్ వైరస్.. 23 ఏళ్ల యువతి ద్వారా దేశంలోకి!
- గత నెల 14న బ్రిటన్ నుంచి షాంఘైకి వచ్చిన యువతి
- షాంఘై, వుహాన్‌లో తిరిగినట్టు గుర్తింపు
- ఆమె ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో అధికారులు
బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. భారత్ సహా వివిధ దేశాల్లోకి ప్రవేశించిన ఈ స్ట్రెయిన్ తాజాగా, కరోనా వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోనూ అడుగుపెట్టింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ కొత్త స్ట్రెయిన్ కనిపించినట్టు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది.
గత నెల 14న షాంఘైకి వచ్చిన 23 ఏళ్ల యువతికి ఈ వైరస్ సోకినట్టు చైనా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె నుంచి డిసెంబరు 24న నమూనాలు సేకరించి పరీక్ష నిర్వహించారు. రిపోర్టుల్లో ఆమెకు బ్రిటన్ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. బ్రిటన్ నుంచి వచ్చిన తర్వాత ఆమె వుహాన్, షాంఘైలలో తిరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆమె ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.
మరోవైపు, యూకే వైరస్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలు సాగించే విమానాలను నిషేధించాయి. 50కిపైగా దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. గత నెల 24 నుంచి చైనా కూడా బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిషేధించింది.