Moderna: కావాలనే వ్యాక్సిన్ డోస్ లను నాశనం చేసిన ఫార్మాసిస్ట్... అరెస్ట్!

Farmasist Spolled 500 Vaccine Doses Arrested

  • గ్రాఫ్టన్ పట్టణంలోని అరోరా ఆసుపత్రిలో ఘటన
  • ఫ్రిజ్ నుంచి తీసి వ్యాక్సిన్ లను బయటపెట్టిన ఫార్మాసిస్ట్
  • ఉద్యోగిని జైలుకు తరలించిన పోలీసులు

అమెరికాలోని విస్కాన్సిస్ రాష్ట్ర పరిధిలోని గ్రాఫ్టన్ పట్టణంలో ఓ ఫార్మాసిస్టు కావాలనే సుమారు 500కు పైగా వ్యాక్సిన్ డోస్ లను నాశనం చేశాడు. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసును నమోదు చేశామని గ్రాఫ్టన్ పోలీసులు వెల్లడించారు. అరోరా మెడికల్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ నిర్లక్ష్యం, విలువైన ఔషధాలను నాశనం చేయడం, ప్రజా భద్రతకు విఘాతం కలిగించడం వంటి సెక్షన్ల కింద అభియోగాలు మోపి, కౌంటీ జైలుకు తరలించామని పేర్కొన్నారు. సదరు నిందితుని పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు.

దేశంలో వ్యాక్సిన్ డోస్ ల సరఫరా అంతంతమాత్రంగానే ఉండగా, హై రిస్క్ ఉన్న వారికి మాత్రమే వీటిని ఇస్తున్న వేళ ఈ ఘటన జరగడం గమనార్హం. నాశనమైన టీకాల విలువ 11 వేల డాలర్ల వరకూ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన తరువాత వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

సదరు ఫార్మాసిస్ట్ ను విధుల నుంచి తొలగించామని అరోరా హెల్త్ కేర్ అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను నియమిత ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచకుంటే, ఉపయోగపడకుండా పోతుందని తెలిసి కూడా అతను 57 వ్యాక్సిన్ వయల్స్ ను బయటకు తీసి, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచాడని పేర్కొన్నారు. ఒక్కో వ్యాక్సిన్ వయల్, 10 మందికి సరిపోతుందని, ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన తరువాత 12 గంటలు మాత్రమే వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కేసును ఎఫ్బీఐతో పాటు ఫైడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్టు గ్రాఫ్టన్ పోలీసులు చెప్పారు. కాగా, ఈ వ్యాక్సిన్ వయల్స్ ను మోడెర్నా సరఫరా చేసింది. అత్యంత శీతల పరిస్థితుల్లో మాత్రమే వీటిని నిల్వ ఉంచాల్సి వుంది.

  • Loading...

More Telugu News