COVID19: రాత్రుళ్లు కర్ఫ్యూ విధించొచ్చు.. రాష్ట్రాలకు సూచించిన కేంద్రం
- దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి
- ప్రజలు గుమికూడకుండా ఆంక్షలు
- మార్కెట్లు నిర్దేశిత సమయం పనిచేసేలా చర్యలు
- ఆంక్షలు ఈ నెల 31 వరకు అమల్లో
దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి పూట కర్య్ఫూపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. రాత్రుళ్లు కర్య్ఫూ విధించుకోవచ్చని తెలిపింది.
అలాగే, ప్రజలు ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో ఒకే చోట చేరకుండా పరిమితులు విధించుకోవచ్చని తెలిపింది. మార్కెట్లు నిర్దేశిత సమయం పనిచేసేలా చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన మార్గదర్శకాల మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా విధించవచ్చు.
విద్యాలయాలు, సాంస్కృతిక, మత సంబంధ కార్యక్రమాల్లో హాళ్లలో 50 శాతం మంది లేక 200 మందికి మించకుండా అనుమతి ఇవ్వవచ్చు. అలాగే, మార్కెట్లలో ప్రజలు గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవచ్చు. ప్రజా రవాణా విషయంలోనూ కరోనా నిబంధనలు అమలు కావాలి. కట్టడి ప్రాంతాలను గుర్తించి అక్కడికి నిత్యావసరాలను మాత్రమే అనుమతించాలి. కరోనా ఆంక్షలు ఈ నెల 31 వరకూ అమల్లో ఉంటాయి.