Raghu Rama Krishna Raju: సీఎం, మంత్రులు తమను తాము దేవతలుగా చెప్పుకోవడం కాదు, గుండెల మీద చెయ్యేసుకుని మాట్లాడాలి: రఘురామకృష్ణరాజు
- గతేడాది ప్రజాకంటక పాలన సాగిందని వ్యాఖ్య
- హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన
- 18 నెలల తర్వాత సీఎం స్పందించాడని వ్యాఖ్యలు
- కంటితుడుపు మాటలు చెబుతున్నారని విమర్శలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు తమను తాము దేవతలుగా చెప్పుకుంటుంటారని, అయితే, ఎవరు దేవతలో, ఎవరు రాక్షసులో గుండెల మీద చేయివేసుకుని మాట్లాడితే స్పష్టమవుతుందని అన్నారు. రాష్ట్రంలో గత ఏడాది ప్రజాకంటక పాలన సాగిందని విమర్శించారు.
హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే 18 నెలల తర్వాత సీఎం జగన్ మాట్లాడారని, కానీ ఆయన కంటితుడుపు మాటలు చెప్పడం మానేసి కఠినచర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రామతీర్థంలో ఘటన మరువకముందే రాజమండ్రిలో అదే తరహా ఘటన జరగడం దురదృష్టకరమని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
సీఎం జగన్, డీజీపీ ఇతర మతానికి చెందినవారు కాబట్టే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా అమలు చేయలేనివారు పదవికి అనర్హులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు.