Sajjala Ramakrishna Reddy: ఇలాంటి చర్యలతో జగన్ తన కన్ను తానే పొడుచుకుంటారా?: సజ్జల

Sajjala responds on idols vandalizing incidents

  • విగ్రహాల ధ్వంసంపై సజ్జల స్పందన
  • జగన్ పై బురద చల్లుతున్నారని ఆరోపణ
  • జనరంజక పాలన నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాలని వెల్లడి
  • చంద్రబాబుది ఫేక్ విజన్ అని వ్యాఖ్యలు

ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం ఘటనలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ సాగిస్తున్న ప్రజారంజక పరిపాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కొందరు ఈ విధంగా ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ పై బురద చల్లాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.

అయినా, సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడి తన కన్ను తానే పొడుచుకోరు కదా? అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడాల్సిన అవసరం సీఎంకు లేదని స్పష్టం చేశారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని, వారి వెనుక ఎవరున్నారో అప్పుడు తెలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సజ్జల కరోనా, ఇళ్ల పట్టాల అంశంపైనా మాట్లాడారు. కరోనా నియంత్రణలో ఏపీ దేశంలోనే మెరుగైన పనితీరు కనబర్చిందని, మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా కరోనాను కట్టడి చేసిందని కొనియాడారు. కరోనా పరిస్థితులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగాయని, అదే చంద్రబాబు అయితే ఇలాంటి పరిస్థితుల్లో అధికారికంగా చేతులెత్తేసేవాడని విమర్శించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారని సజ్జల పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా మహిళలకు సాధికారత కల్పిస్తున్నామని, ఈ పని గతంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబుది ఫేక్ విజన్ అని, ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆటలాడారని విమర్శించారు. చంద్రబాబు పాలన అంతా ఆర్భాటాలతోనే సాగిందని, చంద్రబాబువన్నీ పగటి కలలేనని అన్నారు. గతంలో 2020 అంటూ ఊదరగొట్టి, ఇప్పుడు 2050 అంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News