Pakistan: చైనా ఒక్కటే మాకు గురువు.. వాళ్ల నుంచే నేర్చుకుంటాం!: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్
- గత కొంతకాలంగా పాక్ కు దన్నుగా నిలుస్తున్న చైనా
- పాక్ ను రుణభారం నుంచి గట్టెక్కించేందుకు చర్యలు
- చైనాను ఆకాశానికెత్తేసిన పాక్
- చైనా అభివృద్ధి విధానంపై పొగడ్తలు
పాకిస్థాన్, చైనా దేశాల మధ్య ఉన్న చెలిమి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్ ను రుణభారం నుంచి గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న చైనా ఇప్పటికే భారీగా ఆర్థికసాయం కూడా చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్.... తనకు దన్నుగా నిలుస్తున్న చైనాపై వీలు చిక్కినప్పుడల్లా పొగడ్తల వర్షం కురిపిస్తుంటుంది. తాజాగా మరోమారు చైనాను ఆకాశానికెత్తేసింది. తమకు గురుతుల్య దేశం అంటే చైనానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాలనుకుంటే తాము చైనాను చూసే నేర్చుకుంటామని స్పష్టం చేశారు.
చైనా అభివృద్ధి చెందిన విధానం ఎంతో ప్రత్యేకమని, వారి పంథా పాకిస్థాన్ కు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. గత మూడు దశాబ్దాల కాలంలో చైనా అందుకున్న అభివృద్ధి తమకు స్ఫూర్తిదాయకం అని ఇమ్రాన్ వివరించారు. పేదరికాన్ని రూపుమాపడమే నిజమైన పురోగతి అని చైనా చాటిందని, అందుకే, ప్రపంచంలో ఏ దేశం నుంచైనా అభివృద్ధి పాఠాలు నేర్చుకోదలిస్తే ఒక్క చైనా నుంచే నేర్చుకుంటామని తమ వైఖరిని చాటారు. ఇస్లామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.