Silver: ఇది 'రజత' నామ సంవత్సరమంటున్న మార్కెట్ విశ్లేషకులు!

After golden year for precious metals silver set to shine in 2021

  • డిమాండ్ భారీగా పెరుగుతుందంటున్న మార్కెట్ నిపుణులు
  • బంగారం, ప్లాటినం కన్నా ధరల్లో అధిక వృద్ధి
  • ఈ ఏడాదీ విలువైన లోహాలవైపే ఇన్వెస్టర్ల చూపు
  • బంగారం విలువ 20 శాతం పెరుగుతుందని అంచనా

కారణమేదైనా కావొచ్చు.. గత ఏడాది బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పెట్టుబడిదారులు సంపదను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో విలువైన లోహాలను దాచిపెట్టుకోవడం, దానికి తోడు లాక్ డౌన్ ల వల్ల సరఫరాల్లో లోటు ఏర్పడడం వంటి కారణాల వల్ల వాటి ధర భారీగా పెరిగింది. బంగారం, పెల్లాడియం రేట్లు 20 శాతం, వెండి 47 శాతం వరకు పెరిగాయి. ఇక, అత్యల్పంగా ప్లాటినం ధరలు 10 శాతమే పెరిగాయి.

ఈ ఏడాది కూడా వాటి ధరలు భారీగానే పెరుగుతాయని మెటల్స్ ఫోకస్ అనే అంతర్జాతీయ సంస్థ చెబుతోంది. బంగారం, ప్లాటినం ధరలు ఆకాశాన్నంటుతాయని ఆ సంస్థ ప్రతినిధి ఫిలిప్ న్యూమన్ చెప్పారు. అయితే, వాటి కన్నా కూడా వెండిపై భారీ ధరల పెరుగుదల నమోదవుతుందన్నారు. ప్రభుత్వాలకు ఉన్న భారీ అప్పులు, బాండ్ల నుంచి సరైన రిటర్నులు రాకపోవడం, ద్రవ్యోల్బణ భయాలు, మార్కెట్ ఒడిదుడుకుల వంటి కారణాలతో 2021లోనూ ఇన్వెస్టర్లు బంగారంపై మొగ్గు చూపించే అవకాశం ఉందని రాస్ నార్మన్ అనే మార్కెట్ విశ్లేషకుడు చెప్పారు. వచ్చే ఏడాది వరకు బంగారం విలువ మరో 20 శాతం పెరుగుతుందన్నారు.

అయితే, చాలా రకాలుగా ఉపయోగపడే వెండికి మాత్రం ఈ ఏడాది భారీ డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సౌర విద్యుదుత్పత్తికి వాడే పానెళ్లు, పరిశ్రమల్లో ఇతర అవసరాలు, చిప్ లలో వాడే వెండి ధర గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు భారీగా పెరిగిందని గుర్తు చేస్తున్నారు. ఔన్సు (సుమారు మూడు తులాలు) వెండి ధర 18 డాలర్ల ( సుమారు రూ.1,315) నుంచి 30 డాలర్లకు (సుమారు రూ.2,200) పెరిగిందంటున్నారు. ఆ తర్వాత కొంచెం తగ్గినా మళ్లీ డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. పర్యావరణహిత విద్యుదుత్పత్తిలో పెట్టుబడులు పెంచుతామని అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ చెప్పడంతో.. దానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నారు.

ప్లాటినం ధరలూ పెరిగే అవకాశమున్నా.. వెండికి ఉండే డిమాండ్ మాత్రం వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ కోసం ప్లాటినంను వాహనాల తయారీలో వాడుతున్నారని, అయినా కూడా ఆశించినంత మేర వృద్ధి నమోదు కాకపోవచ్చని వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News