Special Officers: స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన ఆరు నెలలు పొడిగింపు... ఏపీ సర్కారు కీలక నిర్ణయం
- గత ఏడాదిన్నరగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన
- ఆరు నెలలకోసారి పొడిగిస్తున్న ప్రభుత్వం
- ఈ నెల 4, 5 తేదీల నుంచి తాజా పొడిగింపు అమలు
- త్వరలోనే స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ పట్టు
- తమకా ఉద్దేశం లేదని చాటిన ఏపీ సర్కారు!
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఆ ఎన్నికలు జరగకపోవడంతో స్థానిక సంస్థల పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గత ఏడాదిన్నరగా పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
తాజాగా ఈ ప్రత్యేక అధికారుల పాలనను ఏపీ ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిషత్ లకు ఈ నెల 4 నుంచి, జిల్లా పరిషత్ లకు ఈ నెల 5 నుంచి పొడిగింపు ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
ఇప్పటికే పలు దఫాలుగా ఆరు నెలలకోసారి ఈ ఉత్తర్వులను పొడిగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నిర్ణయం చూస్తుంటే, ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం తమకు లేదని స్పష్టంగా చెప్పినట్టయింది. అటు, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర పోరాటం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.