Vijayasai Reddy: విజయసాయిరెడ్డి వాహనంపై చెప్పులు, రాళ్లతో దాడి.. పగిలిన కారు అద్దం!
- రామతీర్థం కొండపై నుంచి కిందకు వచ్చిన విజయసాయి
- కారును అడ్డుకున్న టీడీపీ, బీజేపీ శ్రేణులు
- నడుచుకుంటూ వెళ్లి, వేరే కారులో వెళ్లిపోయిన విజయసాయి
విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రామతీర్థం ఆలయాన్ని పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడకు వెళ్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ సైతం ఈ ఘటనను నిరసిస్తూ అక్కడ ఆందోళనకు దిగింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు అక్కడ ఆందోళన చేస్తున్నాయి. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు కదిలి వచ్చాయి.
అయితే, ఇదే రోజున వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఆలయం వద్దకు వచ్చారు. కొండపైకి వెళ్తున్న విజయసాయిని టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ నినదించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల అండతో ఆయన కొండపైకి వెళ్లారు. ఆయన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కొండపై నుంచి కిందకు వచ్చారు.
తన వాహనం ఎక్కి తిరుగుపయనం అవుతున్న విజయసాయికి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని నిలువరించలేక పోయారు. కారుపై చేతులతో బాదారు. చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. జైశ్రీరాం అంటూ నినదించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఒక రాయి తగలడంతో విజయసాయి కారు అద్దం పగిలింది. దీంతో, ఆయన కారు నుంచి కిందకు దిగి, పోలీసుల సహకారంతో నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్లి, వేరే కారులో బయల్దేరారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో చంద్రబాబు అక్కడకు చేరుకోనున్నారు.