Arjun Tendulker: చివరి నిమిషంలో ముంబయి సీనియర్ జట్టులో సచిన్ తనయుడికి చోటు
- త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
- వార్మప్ మ్యాచ్ ల్లో విఫలమైన అర్జున్ టెండూల్కర్
- 4 మ్యాచ్ ల్లో 4 వికెట్లు, 7 పరుగులతో నిరాశపర్చిన వైనం
- బీసీసీఐ నిబంధనల సడలింపుతో కలిసొచ్చిన అదృష్టం
- అర్జున్ ను జట్టులోకి తీసుకున్న ముంబయి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ముంబయి సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీలో పాల్గొనే ముంబయి జట్టులో అర్జున్ టెండూల్కర్ కు చివరి నిమిషంలో స్థానం లభించింది. వార్మప్ మ్యాచ్ లో పెద్దగా రాణించకపోవడంతో మొదట అర్జున్ కు చోటు నిరాకరించారు. ఆల్ రౌండర్ అయిన అర్జున్ 4 ప్రాక్టీసు మ్యాచ్ ల్లో 4 వికెట్లు, 7 పరుగులు సాధించి తీవ్రంగా నిరాశపరిచాడు. ముంబయి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధాటికి ఓ ఓవర్లో 21 పరుగులు సమర్పించుకున్నాడు.
అయితే, ఓ జట్టులో ఎక్స్ ట్రా ఆటగాళ్లతో కలిపి మొత్తం 22 మంది వరకు ఎంపిక చేసుకోవచ్చని బీసీసీఐ నిబంధనలు సడలించింది. దాంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే ముంబయి జట్టులో సచిన్ తనయుడి పేరు చేర్చారు. 2018-19 సీజన్ లో కొద్దిమేర రాణించిన అర్జున్ ఆ సమయంలో ముంబయి జట్టులో స్థానాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఈసారి మారిన నిబంధనల నేపథ్యంలో అదృష్టం అతడి పక్షాన నిలిచింది. దేశవాళీ క్రికెట్ లో అర్జున్ ఎలాంటి ఆటతీరు కనబరుస్తాడో చూడాలి!