Atchannaidu: ఉత్తరాంధ్ర వ్యవహారాలను ఒక దొంగకు అప్పగించారు: అచ్చెన్నాయుడు
- 151 సీట్లు వచ్చాయనే పొగరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు
- విగ్రహం ధ్వంసమైన నాలుగు రోజులకు మీకు దేవుడు గుర్తొచ్చాడా?
- జగన్ కు హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా ద్వేషం
ముఖ్యమంత్రి జగన్ పాలనలో గత 19 నెలలుగా రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయనే పొగరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేశారని దుయ్యబట్టారు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని అన్నారు.
ఉత్తరాంధ్ర వ్యవహారాలను ఒక దొంగకు అప్పగించారంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఎందరో వైసీపీ నేతలు ఉండగా... బయటి వ్యక్తికి బాధ్యతలను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నాలుగు రోజుల తర్వాత మీకు దేవుడు గుర్తొచ్చాడా? అని మండిపడ్డారు. ఒక ప్రణాళిక ప్రకారమే విజయసాయిరెడ్డి ఈరోజు రామతీర్థంకు వచ్చారని ఆరోపించారు.
హిందువులన్నా, హిందూ దేవాలయాలన్నా జగన్ కు ద్వేషమని అచ్చెన్నాయుడు అన్నారు. ఇన్ని ఘటనలు జరిగినా సీఎం, డీజీపీ స్పందించడం లేదని మండిపడ్డారు. వైసీపీ వాళ్లు చేసిన దుర్మార్గాలను తమ పార్టీ నేతలకు ఆపాదిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.