Hanuman Idol: కర్నూలు జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదు: ఎస్పీ ఫక్కీరప్ప
- ఏపీలో పెరుగుతున్న విగ్రహం ధ్వంసం ఘటనలు
- కర్నూలు జిల్లాలో విగ్రహ ధ్వంసం అంటూ వార్తలు
- ఖండించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
- అవాస్తవాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి
ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలతో ఏపీ అట్టుడుకుతోంది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప వివరణ ఇచ్చారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం వద్ద పొలాల్లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారని వస్తున్న వార్తల్లో నిజంలేదని ఎస్పీ వెల్లడించారు. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ సంఘటనల తాలూకు వార్తలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. స్థానిక పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కూడా ఆలయం వద్దకు వెళ్లి ఎలాంటి ధ్వంసం జరగలేదని నిర్ధారించారని తెలిపారు.