COVAXIN: దేశీయ కరోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్'కు నిపుణుల కమిటీ పచ్చజెండా

Experts committee gives nod for Covaxin

  • కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
  • ఐసీఎంఆర్ సహకారంతో దేశీయంగా వ్యాక్సిన్
  • ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన సీడీఎస్ సీఓ
  • డీసీజీఐ అనుమతులు ఇక లాంఛనమే!

కరోనా రక్కసిని పారదోలేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవాగ్జిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగానికి తెరలేచిన నేపథ్యంలో, భారత్ లో కూడా ఈ దిశగా చర్యలు ఊపందుకున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) నిపుణులు బృందం పలు దఫాలుగా సమావేశమై వ్యాక్సిన్ లకు అత్యవసర అనుమతులపై చర్చించింది. నిన్న జరిగిన సమావేశంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ కు అనుమతి ఇచ్చింది.

తాజాగా, ఇవాళ జరిగిన భేటీలో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ కు ఆమోదం తెలిపింది. దాంతో భారత్ లో ఇప్పటివరకు అనుమతులు పొందిన కరోనా వ్యాక్సిన్ ల సంఖ్య రెండుకు చేరింది. అయితే, ఈ రెండు వ్యాక్సిన్ లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తుది అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో డీసీజీఐ అనుమతి లాంఛనమేనని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News