Vellampalli Srinivasa Rao: ఇలాంటి వ్యక్తిని చైర్మన్ గా ఉంచాలా? అంటూ వెల్లంపల్లి వ్యాఖ్యలు... కొబ్బరిచిప్పల దొంగ అంటూ లోకేశ్ కౌంటర్
- రామతీర్థం ఘటనలో టీడీపీ వర్సెస్ వైసీపీ
- ట్రస్టు చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తొలగింపు
- అశోక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లి
- దీటుగా కౌంటర్ ఇచ్చిన లోకేశ్
- గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన అంటూ ఎద్దేవా
రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన నేపథ్యంలో ఆలయ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాములవారి విగ్రహం తల పగులగొట్టిన వెధవను చైర్మన్ గా ఉంచాలా? అంటూ మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అశోక్ గజపతిరాజు గారి వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుందని చురకలంటించారు. నీతికి, బూతుకు తేడా తెలియనివాడి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుందని విమర్శించారు.
రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్ గజపతిరాజు పూర్వీకులు ఆలయ ధూపదీప నైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారని లోకేశ్ వివరించారు. విజయనగరం సంస్థానంలోని 105 దేవాలయాల నిర్మాణం, పోషణ పూసపాటి వంశీకులదే అని తెలుసా దేవాదాయశాఖ మంత్రీ? అంటూ వెల్లంపల్లిని ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రీ మంత్రీ తెలుసుకో! అంటూ హితవు పలికారు.