USA: 2020 పోయిందంటూ... 270 డాలర్ల బిల్లుకు 2020 డాలర్ల టిప్ ఇచ్చేశాడు!
- ఆతిథ్య రంగాన్ని కుదేలు చేసిన 2020
- వైరల్ అవుతున్న '2020 టిప్ చాలెంజ్'
- యూఎస్ లో బిల్లుకు దాదాపు 8 రెట్ల టిప్
కాలగమనంలో గతించిపోయిన 2020 సంవత్సరం ఎన్ని ఇబ్బందులను తెచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి ప్రజలను పీడించగా, దాన్ని కట్టడి చేసేందుకు దాదాపు అన్ని దేశాల్లో లాక్ డౌన్ లు విధించగా, హోటళ్లు, రెస్టారెంట్లన్నీ ఆరు నుంచి ఏడు నెలల పాటు మూసివేయబడ్డాయి. ఆపై తిరిగి ఆతిథ్య రంగం తెరచుకున్నా, పూర్వపు స్థాయి వ్యాపారం జరగడం లేదు. ఇక, 2020 ముగిసి, 2021 రూపంలో కొత్త సంవత్సరం మొదలైన వేళ, ప్రపంచవ్యాప్తంగా, ఓ కొత్త చాలెంజ్ వైరల్ అవుతూ, సర్వర్ల ముఖాల్లో వెలుగులను నింపుతోంది. దానిపేరే '2020 టిప్ చాలెంజ్'.
ఇక ఈ చాలెంజ్ ని స్వీకరిస్తున్న పలువురు హోటళ్లలో తమకు సర్వ్ చేసిన వారికి 2.020, 20.20, 202.0, 2020 డాలర్లను టిప్ గా ఇస్తున్నారు. కొందరికి ఏకంగా 2020 డాలర్ల టిప్ కూడా అందింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ 'మసాలా మంత్ర ఇండియన్ బిస్ట్రో'లో తనకు సర్వ్ చేసిన ఓ సర్వర్ కు ఒకరు ఏకంగా 2020 డాలర్ల టిప్ ఇచ్చాడు. ఇంతా చేసి అతని హోటల్ ఫుడ్ బిల్ 270 డాలర్లు మాత్రమే.
ఇక సదరు కస్టమర్ ఇచ్చిన టిప్ కు సంబంధించిన బిల్లును ఆ రెస్టారెంట్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. తమ సర్వర్ కు భారీ టిప్ ఇచ్చిన ఆ వ్యక్తి, తనలోని పెద్ద మనసును చాటుకోవడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఇటువంటి వారిని భగవంతుడు చల్లగా చూస్తాడని పేర్కొంది. గతేడాది గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న రెస్టారెంట్లకు ఇటువంటి వారి మద్దతు ఎంతో అవసరమని తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అయితే, అన్ని డాలర్లను టిప్ గా ఇచ్చిన కస్టమర్ పేరును మాత్రం సదరు రెస్టారెంట్ తెలియజేయలేదు.