Seethamma Idol: విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం... సీసీ కెమెరా ఫుటేజి పరిశీలిస్తున్నామన్న పోలీసులు
- ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
- రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికివేత
- ఇవాళ సీతమ్మ విగ్రహం ధ్వంసం
- స్పందించిన బెజవాడ సీపీ
ఏపీలో మరో విగ్రహం ధ్వంసమైంది. రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికి కోనేరులో పడేసిన ఘటన తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తిస్తుండగానే, విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంసమైంది. నగరంలోని నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న సీతారామ ఆలయంలోని సీతాదేవి విగ్రహం కూలిపోయి ఉండగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హిందూ ధార్మిక సంఘాలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టాయి.
ఈ ఘటనపై స్పందించిన సీపీ శ్రీనివాసులు ఘటనపై సీసీ కెమెరా ఫుటేజి పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉదయం 5.30 గంటలకు ఆటోలో వచ్చిన కొందరు దండం పెట్టుకుని వెళ్లారని వెల్లడించారు. విగ్రహం ధ్వంసం ఘటన తమకు ఉదయం 8.30 గంటలకు తెలిసిందని వెల్లడించారు. దీనిపై మరింత పరిశోధిస్తామని చెప్పారు. ఇటీవలే శాంతి కమిటీల సమావేశం నిర్వహించామని, దేవాలయాల వద్ద రాత్రి కాపలా ఏర్పాటు చేశామని తెలిపారు.