Sunil Deodhar: సీఎం జగన్ దేవాదాయ శాఖ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?: సునీల్ దేవధర్
- చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ సమావేశం
- జగన్ సర్కారుపై ధ్వజమెత్తిన సునీల్ దేవధర్
- విజయవాడలో సీతమ్మ విగ్రహ ధ్వంసం బాధాకరమని వెల్లడి
- సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు
- రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిక
ఏపీలో మరో విగ్రహం ధ్వంసం అయిన సంఘటనపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న వేళ సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. జగన్ సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వెల్లడించారు.
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని, ఇప్పుడు విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరమని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఉదంతాలు 150 వరకు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆలయాలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని సునీల్ దేవధర్ విమర్శించారు. కనీసం మంత్రులు ఘటనా ప్రాంతాలకు కూడా రావడంలేదని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.