Bangladesh: తూర్పు పాకిస్థాన్ విముక్తికి 50 ఏళ్లు.. భారత గణతంత్ర వేడుకల్లో బంగ్లాదేశ్ ఆర్మీ!
- తూర్పు పాకిస్థాన్ విముక్తి కోసం పాక్‌తో భారత్ యుద్ధం
- పాక్ ఓటమితో బంగ్లాదేశ్ ఆవిర్భావం
- 93 వేల మంది సైనికులతో లొంగిపోయిన పాక్ ఆర్మీ చీఫ్
ఈసారి భారత గణతంత్ర వేడుకల్లో బంగ్లాదేశ్ ఆర్మీ కూడా పాల్గొననుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఫలితంగా తూర్పు పాకిస్థాన్‌గా ఉన్న బంగ్లాదేశ్.. కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధానికి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 26న నిర్వహించనున్న 72వ రిపబ్లిక్ డే పరేడ్‌లో బంగ్లాదేశ్ ఆర్మీ పాల్గొననుంది. ఇండియన్ ఆర్మీతో కలిసి పరేడ్‌లో పాలుపంచుకోనున్నారు.
భారత్‌తో జరిగిన ఆ యుద్ధంలో పాకిస్థాన్ ఓటమి తర్వాత ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ సహా 93 వేల మంది పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. అయితే, భారత్ వారందరినీ క్షమించి వదిలేసింది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకల్లో పాల్గొనే సందర్శకుల సంఖ్యను అధికారులు కుదించారు. న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో భౌతిక దూరం మధ్య ఈ వేడుకలు జరగనున్నాయి.