CID: రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ... రేపటి ర్యాలీని రద్దు చేసుకోవాలని విపక్షాలకు సూచించిన మంత్రి వెల్లంపల్లి
- అమరావతిలో మంత్రి మీడియా సమావేశం
- సీఐడీ విచారణకు సీఎం ఆదేశించారని వెల్లడి
- విగ్రహాల ధ్వంసం ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టీకరణ
- ప్రతిదీ ప్రభుత్వానికి ఆపాదించొద్దని హితవు
ఏపీలో కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న విగ్రహాల ధ్వంసం ఘటనలను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రామతీర్థం, రాజమండ్రిలో చోటుచేసుకున్న విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీఐడీతో విచారణ జరిపించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. ఈ క్రమంలో, రేపు బీజేపీ, జనసేన తదితర విపక్షాలు చేపట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి వెల్లంపల్లి కోరారు.
చిన్న దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైతే వాటిని కూడా ప్రభుత్వానికి ఆపాదించడం సబబు కాదని స్పష్టం చేశారు. రామతీర్థం ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు తగిన ఆధారాలు దొరికాయని, వారిని తప్పకుండా పట్టుకుంటామని తెలిపారు. ధర్మయాత్ర పేరుతో జనసేన-బీజేపీ రేపు రామతీర్థం వద్ద ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.