USA: దొంగలను అరెస్ట్ చేయకుండా పెద్ద మనసు చాటుకున్న పోలీసు... కారణం విని ప్రశంసల వర్షం!
- ఓ షాపులో ఇద్దరు మహిళల దొంగతనం
- పిల్లలకు క్రిస్మస్ నాడు తిండి పెట్టలేని స్థితిలో చోరీ
- కేవలం ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్లారని తెలుసుకుని డబ్బు కట్టిన పోలీసు
- అమెరికాలోని మసాచుసెట్స్ లో ఘటన
ఓ షాపులో దొంగతనం జరిగిందని పోలీసులకు వచ్చిన కాల్ తరువాత జరిగిన ఘటన ఆన్ లైన్ లో వైరల్ అయి, ఎంతో మంది మనసులను కరిగించింది. ప్రస్తుతం కేసును టేకప్ చేసిన పోలీసుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ కేసు ఏంటి? పోలీసు అధికారిపై ప్రశంసలు ఎందుకన్న విషయంలోకి వెళితే...
సరిగ్గా క్రిస్మస్ కు ఐదు రోజుల ముందు, అమెరికాలోని మసాచుసెట్స్ పరిధిలోని సోమర్ సెట్ పోలీసు డిపార్ట్ మెంట్ లోని మట్ లిమా అనే అధికారికి, స్థానిక సూపర్ మార్కెట్ నుంచి ఫోన్ వచ్చింది. తమ షాపులో దొంగతనం జరిగిందన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. కేసును విచారించేందుకు మట్ లిమా ఘటన జరిగిన సూపర్ మార్కెట్ కు వెళ్లాడు.
ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు తమ షాపునకు వచ్చారని, వారు తీసుకున్న వస్తువులన్నింటినీ, స్కాన్ చేయించుకోలేదని, వాటిని తమ బ్యాగుల్లో సర్దుకుని వెళ్లారని షాపులో పనిచేస్తున్న ఉద్యోగి తెలిపాడు.
ఆపై వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన మట్ లిమా, వారి పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆ ఇద్దరు పిల్లల వయసులోనే తన పిల్లలు కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నాడు. తమ పిల్లలకు క్రిస్మస్ డిన్నర్ ఇచ్చే స్థితిలో లేని వారు ఈ చోరీ చేశారని తేల్చాడు. కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే ఆ ఇద్దరు మహిళలు తీసుకున్నారని, మరే ఇతర విలువైన వస్తువులను దొంగిలించలేదని తెలుసుకున్నాడు. వారికి ఇప్పుడు ఉపాధి లేదని, పండగ పూట పిల్లలకు మంచి తిండి పెట్టేందుకే ఈ పని చేశారని అర్థం చేసుకుని, వారు తీసుకుని వచ్చిన ఫుడ్ కు తానే స్వయంగా డబ్బులు చెల్లించాడు.
వారిపై ఎటువంటి నేరారోపణలు చేయరాదని నిర్ణయించుకున్న మట్, వారు మరింత ఆనందంగా క్రిస్మస్ చేసుకునేందుకు సహకరించాడు. ఈ మొత్తం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసు ఉన్నతాధికారులు సైతం తమ ఉద్యోగి చేసిన పని, మొత్తం పోలీసు వ్యవస్థకు గర్వకారణమని కొనియాడారు.