Harsha Vardhan: కాలాన్ని కరోనా మహమ్మారి ఎన్నో ఏళ్లు వెనక్కు నెట్టింది: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
- ఎన్నో దశాబ్దాల ప్రయత్నాలను విచ్ఛిన్నం చేసిందని వ్యాఖ్య
- ఇలాంటి కష్టకాలంలో వ్యూహాత్మక ఆలోచనలు కావాలని పిలుపు
- సమాజానికి డాక్టర్లే వెన్నెముక అని ప్రశంసలు
కరోనా మహమ్మారి కాలాన్ని ఎన్నో ఏళ్లు వెనక్కు నెట్టేసిందని, తప్పని పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ ల వల్ల అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. అభివృద్ధి కోసం ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కరోనా విచ్ఛిన్నం చేసిందన్నారు. మంగళవారం ఢిల్లీలోని శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘లాక్ డౌన్ లు కోలుకోలేని దెబ్బ తీశాయి. వాటి వల్ల సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులే ఏర్పడ్డాయి. ఇలాంటి కష్టకాలంలో వ్యూహాత్మకమైన ఆలోచనలు కావాలి. సరికొత్త, వైవిధ్యమైన, దృఢమైన సమాజ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుతం సమాజానికి డాక్టర్లే వెన్నెముక అని, వాళ్లు తలచుకుంటే అన్ని సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. 23 రాష్ట్రాల్లో ఈ సంజీవని సేవలు అందుతున్నాయని, ఇప్పటిదాకా 11 లక్షలకుపైగా టెలీమెడిసిన్ సేవలు పొందారని చెప్పారు.