AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారుల సంఘానికి లేఖ రాసిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు
- ఇప్పటివరకు తనకు పోస్టింగ్ ఇవ్వలేదన్న ఏబీ
- రెండుసార్లు లేఖలు రాసినా స్పందన లేదు
- తక్షణమే ఐపీఎస్ అధికారుల సంఘం సమావేశమవ్వాలని విజ్ఞప్తి
- తన అంశంపై చర్చించాలని వినతి
కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఐపీఎస్ అధికారుల సంఘానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో జగన్ ప్రభుత్వం తనకు పోస్టింగ్ ఇవ్వలేదని లేఖలో ఆరోపించారు.
పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రెండుసార్లు లేఖ రాశానని వెల్లడించారు. 30 ఏళ్ల సర్వీసులో తనపై ఎలాంటి కేసులు లేవని, ఎలాంటి విచారణలు లేవని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు, అభియోగాలతో పోస్టింగ్ నిరాకరిస్తున్నారని అన్నారు. ఐపీఎస్ అధికారుల సంఘం వెంటనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి తన సమస్యను పరిష్కరించాలని ఏబీ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
"గతేడాది ఫిబ్రవరి 2న డీజీపీ నుంచి మెమో వచ్చింది. ఇంటెలిజెన్స్ విభాగానికి పరికరాల కొనుగోలుపై ఆ మెమో ఇచ్చారు. 2020 ఫిబ్రవరి 8 నుంచి నన్ను సస్పెన్షన్ లో ఉంచారు. సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్, హైకోర్టులో పిటిషన్ వేశాను. పోస్టింగ్ ఇవ్వకపోగా 10 నెలల తర్వాత నాపై ఆర్టికల్ ఆఫ్ చార్జ్ జారీ చేశారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఉంది. ప్రభుత్వం నుంచి వేధింపులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాను" అంటూ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.