Chinna Jeeyar Swamy: ఏపీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే దారుణ స్థితి దాపురించింది: చినజీయర్ స్వామి
- సరైన దృష్టి లేకపోవడం వల్లే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి
- 17వ తేదీ నుంచి ధ్వంసమైన ఆలయాలను సందర్శిస్తాం
- సహనాన్ని పరీక్షించేందుకు కూడా ఒక హద్దు ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే దారుణ స్థితి దాపురించిందని అన్నారు. ఈనెల 14తో ధనుర్మాస దీక్ష పూర్తవుతుందని... 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన అన్ని ఆలయాల సందర్శన కోసం యాత్రను చేపడతానని చెప్పారు. మంగళగిరి సమీపంలోని సీతానగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆలయాలపై సరైన దృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చినజీయర్ స్వామి అన్నారు. ఆలయాల ఉనికికే భంగం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉండకూడదనే తాను బయటకు వస్తున్నానని చెప్పారు. ఇలాంటి తప్పులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రచారం కోసం కొందరు ఇలాంటి పద్ధతిని ఎంచుకోవడం సరికాదని అన్నారు.
సహనాన్ని పరీక్షించడానికి కూడా ఒక హద్దు ఉంటుందని చినజీయర్ చెప్పారు. మత పరమైన విషయాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్నారు. ప్రజలకు భరోసా కలిగించేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించాలని చెప్పారు. ఆలయం, మసీదు, చర్చి ఏదైనా సరే... వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.