Raghu Rama Krishna Raju: రామతీర్థం ఘటనలో విచారణ అధికారి సునీల్ కుమార్ ఓ క్రైస్తవుడు... న్యాయం జరగదు: రఘురామకృష్ణరాజు
- సంచలనం సృష్టించిన రామతీర్థం ఘటన
- దర్యాప్తును సీఐడీకి అప్పగించిన సీఎం జగన్
- విచారణాధికారి సునీల్ కుమార్ రికార్డుపై రఘురామ వ్యాఖ్యలు
- గతంలో హైకోర్టు మందలించిందని వివరణ
రామతీర్థం ఘటనపై విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తుకు నాయకత్వం వహించే అధికారి సునీల్ కుమార్ ఓ క్రైస్తవుడని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఏపీ సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీ కూడా క్రైస్తవ మతస్తులేనని అన్నారు. ఇక, సునీల్ కుమార్ నిబంధనలను పట్టించుకోడని, ఆయనను గతంలో హైకోర్టు కూడా ఇదే అంశంలో మందలించిందని వివరించారు. ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకునే వ్యక్తి సునీల్ కుమార్ అని విమర్శించారు.
గతంలో రంగనాయకమ్మపై కేసులు పెట్టడంలోనూ, తన స్నేహితుడు కిశోర్ చావుకు కూడా ఈ సునీలే కారకుడు అని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అసలు ఇలాంటి వ్యవహారాలకు తెరవెనుక సూత్రధారి సీఎం ఆఫీసులో ఉండే అవినాశ్ అని, అతడ్ని అందరూ ట్రంప్ అవినాశ్ అంటుంటారని వెల్లడించారు. బహిరంగ చర్చ పెడితే తాను ఇవన్నీ చెప్పడానికి సిద్ధమేనని అన్నారు.
అయితే, రామతీర్థం ఘటన ఎంతో సున్నితమైన అంశం అని, ఇలాంటి ఘటనలపై విచారణను క్రిస్టియన్లు, రెడ్లకు కాకుండా, ఇతర వర్గాలకు చెందిన మంచి అధికారి చేతికి అప్పగించాలని రఘురామకృష్ణరాజు సూచించారు. ముఖ్యంగా, ఓ బ్రాహ్మణ వర్గానికి చెందిన అధికారి అయితే విచారణకు సరిపోతాడని అభిప్రాయపడ్డారు. రామతీర్థం ఘటన ఒక వర్గం మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశం కాబట్టి, సునీల్ కుమార్ వంటి అధికారితో న్యాయం జరగదని ప్రజలు అనుమానిస్తున్నారని తెలిపారు. క్రిస్టియన్, రెడ్డి కులానికి సంబంధంలేని వారితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి, పారదర్శకత నిరూపించుకోవాలని హితవు పలికారు.