Jagan: జగన్‌ను కలిసిన విశాఖ శారదాపీఠం స్వాత్మానందేంద్ర సరస్వతి.. ఆలయాలపై దాడులపై చర్చ!
- ఆలయాల భద్రతపై మాట్లాడానన్న స్వామీజీ
- స్వరూపానంద ఇచ్చిన సూచనలను వివరించానని వెల్లడి
- దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారన్న స్వామి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వారితో పాటు ఉన్నారు. సీఎంతో భేటీ అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, ఆలయాల భద్రతపై జగన్ తో మాట్లాడానని చెప్పారు. ఆలయాలపై జరిగిన దాడులపై దర్యాప్తును వేగవంతం చేయాలని కోరినట్టు తెలిపారు. స్వరూపానందేంద్ర స్వామి ఇచ్చిన సూచనలను వివరించామని చెప్పారు.
ప్రైవేట్ ఆలయాల కమిటీలతో దేవాదాయశాఖ, పోలీస్ శాఖ సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆలయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ స్టేషన్ల వారీగా దృష్టి సారించాలని చెప్పారు. తాము సూచించిన అంశాలపై జగన్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారని వెల్లడించారు.