Pawan Kalyan: అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా యుద్ధం చేయడానికి ఎవరు సాహసిస్తారు చెప్పండి?: సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ సూటిప్రశ్న
- ఏపీలో కొనసాగుతున్న ఆలయాలపై దాడులు
- ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్
- ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని సీఎంపై వ్యాఖ్యలు
- త్వరలోనే దోషులను పట్టుకోవాలని హితవు
ఏపీలో విపక్షాలన్నింటికి విగ్రహాల ధ్వంసం ఘటనలే ప్రధాన అజెండాగా మారాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే అనేక ఘటనలు జరగడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. గత రెండేళ్ల కాలంలో.... ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 100కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. ఈ అరాచకాలపై గట్టిగా ప్రశ్నిస్తే, విపక్షాలు గెరిల్లా యుద్ధం నడిపిస్తున్నాయంటూ సీఎం జగన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎవరూ హర్షించరని పవన్ హితవు పలికారు.
"మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు సీజేలు, జడ్జిలు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా యుద్ధం చేయడానికి ఎవరు సాహసిస్తారు చెప్పండి. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్ లు, 115 మంది అదనపు ఎస్పీలు, వేలమంది పోలీసులు మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసినవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది.
సోషల్ మీడియాలో మీపైనా, మీ పార్టీ పైనా పోస్టులు పెట్టేవారిపైనా, నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ వంటి వారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసినవారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? రాష్ట్రంలో 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు కదా.. వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారా? ఎక్కడ ఉంది మీ లోపం.. మీలోనా... మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?" అంటూ విమర్శలు గుప్పించారు.
పైగా విపక్షాలన్నింటినీ ఒకే గాటన కట్టడం ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా ఎంతో సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్లపైకి రావలసిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇకనైనా మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకుని, వారిని ప్రజల ముందు నిలపాలని హితవు పలికారు.