Kodali Nani: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు: కొడాలి నాని
- చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణం
- వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబుకు అలవాటు
- జగన్ ను లోకేశ్ విమర్శించడం విడ్డూరంగా ఉంది
ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించినా ఘటనలు ఆగడం లేదు. మరోవైపు అధికార పార్టీపై విపక్షాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్, హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ముగ్గురూ క్రిస్టియన్లని... అందువల్లే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై రాష్ట్ర మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. కులాలు, మతాల గురించి మాట్లాడటం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. సీఎం, హోంమంత్రి, డీజీపీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. మతాల ఆధారంగా అధికారులు పని చేయరని చెప్పారు. జగన్ ను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. జగన్ అంటే ఒక వ్యవస్థ అని... మిడతలాంటి నారా లోకేశ్ జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలే భూస్థాపితం చేస్తారని అన్నారు.