Crows: గుంటూరు జిల్లాలో కాకుల మృతి... బర్డ్ ఫ్లూ కలకలం

Crows died in Guntur district

  • గుదిబండివారి పాలెంలో ఆరు కాకులు మృత్యువాత
  • హైస్కూల్లో చచ్చిపడి ఉన్న కాకులు
  • అధికారులకు సమాచారం అందించిన స్థానికులు
  • కోళ్లఫారాలను పరిశీలించిన అధికారులు
  • అనుమానాస్పద లక్షణాల్లేవని వెల్లడి

మధ్యప్రదేశ్ లో మొదలైన బర్డ్ ఫ్లూ కలకలం ఇప్పుడు ఏపీకి కూడా పాకింది. గుంటూరు జిల్లాలో పలు కాకులు మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని కొల్లిపర మండలం గుదిబండివారి పాలెం హైస్కూల్ వద్ద 6 కాకులు మృతి చెందాయి. ఒక్కసారే అన్ని కాకులు మరణించడంతో స్థానికులు ఆ విషయాన్ని వెటర్నరీ అధికారులకు తెలియజేశారు.

దీనిపై స్థానిక వెటర్నరీ అధికారిణి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, గత మూడ్రోజులుగా ఇక్కడ కాకులు మృత్యువాత పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బర్డ్ ఫ్లూ అనుమానంతో ఇక్కడి కోళ్లఫారాలను పరిశీలించామని, ఎక్కడా అనుమానించదగ్గ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. కాకులు మృతి చెందిన ఘటనపై పరిశీలించామని, విచారణ పూర్తయ్యాక వాస్తవాలను ప్రజలకు వెల్లడి చేస్తామని శ్రీలక్ష్మి తెలిపారు.

కాగా, బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కాకులు ప్రాణాలు కోల్పోతుండడాన్ని కేంద్ర తీవ్రంగా పరిగణిస్తోంది.

  • Loading...

More Telugu News